bullet train: ఇక అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి రైల్లో 3.5 గంటల్లోనే..!

  • గరిష్ఠంగా 350 కి.మీ. వేగంతో దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు
  • ప్రస్తుతం ఇరు నగరాల మధ్య రైలు ప్రయాణానికి 12 గంటల సమయం
  • ఈ ప్రాజెక్టుకు ఆమోదంపై తుది నిర్ణయం తీసుకోనున్న కేంద్రం
  • ఇప్పటికే తుది దశకు చేరుకున్న అహ్మదాబాద్–ముంబై బుల్లెట్ రైలు నిర్మాణం
bullet train from ahmedabad to delhi

గుజరాత్ తాజాగా మరో బుల్లెట్ రైలు ప్రాజెక్టు పొందేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు చేరుకోగా అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి సైతం బుల్లెట్ రైలు త్వరలో దూసుకెళ్లనుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైల్లో ప్రయాణానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ఆ సమయం కాస్తా 3.5 గంటలకు తగ్గిపోనుంది. ఎలివేటెడ్ కారిడార్‌లో సగటున గంటకు 250 కి.మీ. వేగంతో ప్రయాణించడం వీలవుతుంది. ఈ మేరకు రైల్వే శాఖ సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఖరారు చేసింది. దీని ప్రకారం ప్రతిపాదిత బుల్లెట్ రైలు హిమ్మత్‌నగర్, ఉదయ్‌పూర్, భిల్వారా, చిత్తోర్‌గఢ్, అజ్మీర్, కిషన్‌గఢ్, జైపూర్, రేవారీ, మనేసర్ స్టేషన్ల మీదుగా వెళ్తుంది.

పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు..
లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్న బీజేపీ తన మేనిఫెస్టోలో ఉత్తర, దక్షిణ, తూర్పు భారతదేశంలో ఒక్కో బుల్లెట్ రైలును నడుపుతామని హామీ ఇచ్చింది. కేంద్రం ఆమోదించిన ఆరు కొత్త హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుల ప్రణాళికలో అహ్మదాబాద్-ఢిల్లీ బుల్లెట్ రైలు ఒక భాగం. దేశంలోని రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.

సర్వేలు పూర్తి..
నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ తుది లైన్ అలైన్ మెంట్ కోసం 2020 సెప్టెంబర్ లో బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో ఏరియల్ లైడార్ సర్వేలు భాగం. బుల్లెట్ రైలు ప్రణాళిక ప్రక్రియ వేగవంతానికి కార్పొరేషన్ ఈ ఏరియల్ సర్వేలు నిర్వహించింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు కేంద్రం నుంచి తుది ఆమోదం లభించాల్సి ఉంది. అహ్మదాబాద్, ఢిల్లీ మధ్య దాదాపు 900 కిలోమీటర్ల మేర నిర్మించే బుల్లెట్ రైలు ఎలివేటెడ్ కారిడార్ తో ఇరు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 9 గంటలు తగ్గనుందని రైల్వే అధికారులు తెలిపారు.

సబర్మతి స్టేషన్ నుంచి ప్రారంభం
ఈ బుల్లెట్ రైలు సర్వీసు మల్టీమోడల్ హబ్ ఏర్పాటు చేయనున్న సబర్మతి స్టేషన్ నుంచి మొదలు కానుంది. ఈ మార్గంలో అహ్మదాబాద్, ఢిల్లీ స్టేషన్లు కాకుండా మరో తొమ్మిది ప్రధాన స్టేషన్లు ఉంటాయి. ఈ రైలు గరిష్ఠంగా గంటకు 350 కి.మీ వేగంతో నడుస్తుందని అంచనా. ఈ రైలు గుజరాత్, రాజస్థాన్, హరియాణా రాష్ట్రాల మీదుగా ఢిల్లీ చేరుకుంటుంది. మరోవైపు అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు సర్వీస్ 2026 జూలై నాటికి ప్రారంభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

More Telugu News